Tuesday, March 25, 2014

అసూయతో పోరాటం
________________
ఒకర్నొకరు భయంకరమైన శత్రువులుగా భావించుకునే ఇద్దరు దుకాణం యజమానుల గురించి చెప్పబడ్డ ఒక  కథ ఉంది.  ఆ ఇద్దరు ఓనర్ లు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ దుకాణంలో ఏం  జరుగుతుంది ?? వాళ్ళ వ్యాపారం ఎంత జరిగింది ?? ఎంత మంది కస్టమర్లొ చ్చారు ?? లాంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించే వారు. వారి దుకాణానికి ఎవరైనా ఒక కస్టమర్ వస్తే , ఎదుటి వాడి వైపు చూసి గట్టిగా గర్వంగా   నవ్వేవారు .

ఇలా ఉండగా ఒక రోజు రాత్రి దుకాణం యజమానుల్లో ఒక యజమాని దగ్గరకు ఒక దూత వచ్చి, ఏం  వరం కావాలో కోరుకో కాని ఒకటి గుర్తుంచుకో, నువ్వు కోరుకునే కోరికకు రెండంతలు నీకు  పోటీఅయిన వాడికి అంటే నీ పొరుగు దుకాణం ఓనర్ కి  జరుగుతుంది అని, తను వచ్చిన ఉద్దేశ్యం చెప్పింది . 


వెంటనే ఆ యజమాని దూత కాళ్ళ మీద పడి తన కళ్ళలో ఒక కన్ను తీసేయమని వరమడిగాడు .

అసూయ, ద్వేషం ఎలాంటివంటే స్వనాశనాన్ని కాంక్షించి స్వపతనం వైపు నదిపేవి.

ఈ అసూయనే కోరింథి సంఘాన్ని చీల్చింది. కోరింథి  సంఘంలోని విశ్వాసులు వాక్యాన్ని అంగీకరించినా వారి హృదయాలను పరిశుద్ధాత్మకు , పరిశుద్ధాత్మ కార్యానికి  అనువుగా మార్చుకోలేదు. దాని పర్యవసానంగా అసూయ తమ హృదయాల్లో చేరి కోరింధి  సఘాన్ని చీల్చింది. అదే విషయాన్ని I కోరింధి 3:3 లో పౌలు మాట్లాడుతూ -

"మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా? " అని అంటాడు . అయితే ఆ విశ్వాసులు నిజంగా సువార్త విని వాక్యపు జీవంతో పరిశుద్ధాత్మ ఒప్పుకోలుతో నడిచిన వారిలా  ఉండరు. 
ఈ మధ్య కాలంలో మన సంఘాల్లో కూడా ఇది చూస్తున్నాం. ఒక వర్గం వారు నాయకులైతే మరో వర్గం వారు సంఘానికి వాళ్ళ నియమకాలం అయ్యే వరకు రారు. ఒక వర్గం ఒకటి ప్రతిపాదిస్తే ఇంకో వర్గం వినదు. అసలు సంఘానికి ఆరాధన కోసం కాక  తమ ఉనికి చాటుకోవడానికి మాత్రమే  వస్తున్న వారు లేరా ? ఇలాంటివి సంఘాల్లో జరగడం వల్లనే కొత్త కొత్త స్వతంత్ర సంఘాలు పుట్టుకొచ్చి కొత్త ఆరాధనా క్రమాలు , తప్పుడు బోధలు జరగడానికి పీఠలు వేయడం లేదా ? సంఘం క్రీస్తు శరీరం క్రీస్తు సంఘానికి అధిపతి అనే విషయం మనం మర్చే పోతున్నాం . కాదంటారా ?ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు  తమ హృదయాల శుద్ధీకరణ చేస్తూ తమతో వాసమై ఉంటాడో అక్కడ ఇలాంటి అసూయకు తావే ఉండదు . 


పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తున్నాడు అన్న దానికి సూటి అయిన నిదర్శనం మనకు కలిగిన ప్రతిదానికి మనం ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాం. ఒకరి మీద ఒకరికి అసూయ లేకుండా అందరికీ కలిగే ఆశీర్వాదాలను బట్టి సంతోషిస్తాం. 


ఈ రోజు దేవునికి కృతఙ్ఞతలు చెబుదాం. -"దేవా నువ్వు మాకిచ్చిన ప్రతి శ్రేష్టమైన ఈవులను బట్టి నీకు కృతజ్ఞతలు. మాకేది అవసరమో అది నువ్వు మాకిచ్చావ్. మాకన్నా ముందే మా అవసరతలు నీకు తెలుసు. నువ్వు మాకున్న గొప్ప గనివి, మా సంపదల నిదివి ,జీవపు ఊటవి . ఒకవేళ నువ్వే లేకపోతే  మాకు ఈ బ్రతుకే ఉండేది కాదు "అని . 


Friday, March 21, 2014

మరుగై యుండలేని పరిమళ తైలం 
___________________________
గులాబీల నుండి తయారు చేసే  అత్తరుతైలానికి బల్గేరియా ప్రసిద్ధి. ఆ గులాబీ అత్తరును ఎగుమతి దిగుమతి చేయాలంటే ఎంతో ఎక్కువ సుంకం చెల్లించాల్సి వస్తుంది. యాత్రికుడుగా (tourist) వచ్చిన ఒక వ్యక్తి  అంత సొమ్మును సుంకంగా చెల్లించడం ఇష్టం లేక రెండు చిన్న బుడ్డీల అత్తరును తీసుకుని తన సూట్కేస్ లో దాచుకుని బయల్దేరాడు. అతడు ఆ అత్తరు సీసాను సూట్కేసులో పెట్టుకునేప్పుడు రెండు చుక్కల అత్తరు దానిపై పడింది. ఆ వ్యక్తి  రైలు ఎక్కడానికి స్టేషన్ వరకు రాగానే ఆ అత్తరు సువాసనా ఆ చుట్టు ప్రక్కల వ్యాపించింది. 


అక్కడి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ లకు అతడు దాచిపెట్టిన విలువగల వస్తువేంటో అర్ధమయ్యింది. వెంటనే ఆ మరిచిపోలేని, మస్తిష్కంలోంచి తుడిచివేయలేని ఆ సువాసనలు వ్యాపింపచేసిన తైలాన్ని స్వాధీనపరుచుకున్నారు.

యేసు ప్రభు వారు కూడా అంతే . ఆయన్ని మనలో దాచిపెట్టి అందరితో మామూలుగా మసలుకోగలిగే ఆస్తి కాదు.

ఆయన పరిచర్య చేస్తున్న రోజుల్లో ఆయన ఎక్కడ ఉంటె అక్కడ జనసమూహం ఆకర్షింపబడింది. ఆయన మాటలలోని జ్ఞానం వినడానికి. ఆయన చేసే ఆశ్చర్యకరమైన సంఘటనలని చూస్తూ ఆయన నుండి మేలులు పొండుకోడానికి ఆయన ప్రేమను, కృపను   రుచి చూడడానికి వేవేలుగా ఆయన్ని చుట్టుకునే వారు. 


యేసు ప్రభువు  పరలోకానికి ఆరోహనమై వెళ్ళిన తరువాత కూడా యేసు క్రీస్తు ప్రభావం వారి  జీవితాల్లో యదార్ధమైనది పని చేసింది. ఆ అనుచరుల్లో  ఆయన దాగున్నాడని వారి మాటలు ప్రవర్తన పరిచర్యలో ఆయన మూర్తిమత్వం దాగుందని ప్రజలు , వారిని చూసిన జనాలు గుర్తించారు ( అపోస్తు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.).


మనలో ఆయన అలాగే ఉన్నాడా? ఆయన్ని మనలో దాచుకుని నిజంగా అలా ప్రేమిస్తున్నామా ? ఆయన కొరకు జీవిస్తున్నామా? దాచిపెట్టుకోలేని వాడుగా ఆయన మనలో నుండి మనలని చూసిన వారికి కనిపిస్తున్నాడా ?
(మార్కు 7:24 ఆయన అక్కడనుండి లేచి, తూరు సీదోనుల ప్రాంత ములకు వెళ్లి, యొక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై యుండ లేక పోయెను.). ఒక వేళ అలా జీవిస్తుంటే ప్రపంచం క్రీస్తు వైపున్న వాళ్ళగా మనలని చూస్తుంది. మన లోంచి ఆ ప్రభావం సువాసన వారిపై కూడా పని చేస్తుంది. ఎందుకంటే ఆయన దాచి పెట్టలేని పరిమళతైలమ్.
When we've been alone with Jesus,
Learning from Him day by day,
Others soon will sense the difference
As we walk along life's way. —Hess

Sunday, March 16, 2014

ఎంతో ఉత్సాహంగా కొందరు నూతన సంవత్సరం మొదటి రోజున గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. -" ఈ సంవత్సరం ఎలాగైన పరిశుద్ధ గ్రంధాన్ని మొత్తం చదివి ముగించాలి అని" . నిర్ణయించుకున్న దాని ప్రకారమే చదవడం కూడా మొదలుపెట్టేస్తారు. కాని చివరికి బైబిల్ పఠనం కుంటుపడేదల్లా లేవికాండము దగ్గరకు రాగానే . 

సృష్టి ఆరంభం.ఆశ్చర్యంగా , చక్కగా చెప్పబడే కథలా ఆదికాండము ముగుస్తుంది. గొప్ప సమూహంగా బయలుదేరిన ఇశ్రాయేలీయులు ఎలా ఈజిప్ట్ ని దాటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలు దేరారు అన్న విజయవంతమయిన గాధలా నిర్గమాకాండము అయిపోతుంది. లేవికాండము మాత్రం మర్మాలతో చుట్టబడ్డ గ్రంధంలా ఉంటుంది. అప్పుడు వరకు యాత్రికులైన ఇశ్రాయేలీయుల గోత్రాల్లోని లేవి గోత్రాన్ని ఎన్నుకుని యాజకులుగా ఉండడానికి ఏర్పర్చున్నట్టు చూస్తాం .. దేవుడు యాజకులకు , ప్రధానయాజకునికి అలాగే ఇశ్రాయేలీయులు పాటించవలసిన నియమాలు విధుల గురించి చూస్తాం. మరి ముఖ్యంగా ప్రధాన యాజకునికి ఇచ్చిన టెక్నికల్ మాన్యుల్ లాగా లేవికాండము ఉంటుంది.

యాజకునికి చెప్పబడ్డ విషయాలను తక్కువగా చేసి చూసి స్కిప్ చేస్తూ వదిలేస్తూ ముందుకు దూకేసి అధ్యాయాన్ని తొందరగా ముగించేయాలని ఆత్ర పడకండి. ఎందుకంటే 420 ఏళ్ళు బానిసలుగా ఉన్న ప్రజలు విడుదల పొంది యాత్ర చేస్తున్న ప్రజలు అక్కడున్నారు. ఈజిప్ట్ బానిసత్వ గతం నుంచి దేవుడు మహిమాన్వితంగా తీసుకెళ్తున్న భవిష్యత్తు లోకి, స్వాతంత్ర్యంలోకి నడవబోతున్న ఆ యాత్రికులకు లేవికాండము "Life Guide" .

లేవికాండము మధ్య భాగంలో 18 వ అధ్యాయంలో ఆయన లేవీయులకు ఏమి చెప్పాలనుకున్నాడో తెలియజేస్తాడు. 18:3-5 " మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు//. మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను యెహోవాను.
.//మీరు నాకట్టడలను నా విధు లను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను//.

దేవుడు మానవాళిని రక్షించడానికి 1500 ఏళ్ళ ముందే చిత్రించిన రక్షణ ప్రణాళికా చిత్రం లేవికాండము లో కనిపిస్తుంది. మానవుడిగా , సిలువయాగము చేయబోతున్న గొర్రెపిల్లగా రాబోతున్న యేసు ప్రభుని అక్కడే ఆయన చిత్రించాడు. యోహాను 1:29 లో యోహాను ఈ విషయాన్ని నిర్దారణగా ఇలా అన్నాడు. -"యోహాను - యేసు తనయొద్దకు రాగా చూచిఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల."

మన ఈ లోక జీవనయాత్రలో ఆదికాండము నుండి ప్రకటన వరకు ప్రయానించేప్పుడు లేవికాండము లాంటి స్థలాలు వచ్చినప్పుడు ఆగకుండా యాత్ర సాగిద్దాం. లేవికాండంలో బలిగా మారబడ్డ యేసు ప్రభువారిని వెంట బెట్టుకుని మరీ వెళ్దాం. లేవికాండం ఒక అధ్బుతమైన వంతెన అది మనలని బలియాగం నుండి రక్షకుని దగ్గరకు చేర్చుతుంది.

The offerings of animals,
Were made in days of old,
To point us to the Lamb of God,
His sacrifice foretold. —Fitzhugh