ఒంటరివా నీకోసమే
---------------------------
మూగబోయిన గొంతు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సార్లు ప్రతిస్పందించదు .ఎన్ని పరిస్థితులు ఆ గొంతును మూగ బోయేలా చేసుంటాయో .ఎన్ని భయానక వాహనాలు ఆ గొంతు దారులగుండా ప్రయాణించి మాటలని అణిచి
వేసుంటాయో .ఎన్ని అవమానాలు నిందలు ఆ గొంతులోని మాటల్ని త్రవ్వి వేసాయో.
అలాంటి వాళ్ళపై సమాజము ,మనుషులు జాలి పడకుండా వుండరు . కొందరైతే జాలి చూపకపోగా ఇంక్కొన్ని రాళ్ళు వేసి వెళ్తారు , ఏదైతేనేం బైబిలు లో కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్లి ఒంటరి తనం అనుభవించిన వారు లేక పోలేదు కాని ఆ ఒంటరితనంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి పాఠం నేర్పుతూ వచ్చాడు .
యాకోబు తండ్రిని మోసం చేసి , అన్నను మోసం చేసి ,ఇంటి నుంచి మోసగాడి గా పారిపోయి అరణ్యానికి చేరాడు .
అంతవరకు సాధువై గుడారములో నివసించిన వాడు (ఆది కాండము 25:27).కాని ఇప్పుడు ఒంటరి వాడిగా చావు భయాన్ని మెడలో వేసుకొని తెలియని స్థలానికి ఒంటరిగా ప్రయాణమయ్యాడు . మోసగాడనే అర్ధమిచ్చే పేరు పెట్టుకున్నందుకు సార్ధకం చేసుకున్నాడని తండ్రే అన్నాడంటే అతని మానసిక స్థితి ఎంత ఆందోళనగా ఉండి ఉందో .
జ్యేష్టత్వాన్ని దొంగిలించాడు , ఆశీర్వాదాలని దొంగిలించాడు , కాని ఏం లాభం ఒంటరిగా ప్రశాంతతని పోగొట్టుకొని ప్రాణ భయంతో కుటుంబం నుంచి సహవాసం నుంచి ఒంటరితనంలోకి , ఎవరూ తెలియని క్రొత్త ప్రదేశానికి నడక ప్రారంభించాడు. ఏవేవి నేమరేసుకుంటూ ,తనలో తానూ ఏవేవి మాట్లాడుకుంటూ బయలుదేరాడో ?!.మనలో కొందరిలాగే తప్పు చేసామన్న భావన సమాజం చీత్కారం స్వీకరించి ఒంటరి చేయబడి మన నుంచి మనమే పారిపోయే సమయం కూడా ఇలాగే ఉంటుంది కదూ ..
రోజంతా బెయేర్షెబానుండి బయలుదేరి హారాను వైపు నడిచాడు చీకటి పడింది ఒక చోట ఆగాడు (ఆదికాండము 28:10-11).ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికుని, అక్కడ పండుకున్నాడు.
ఒంటరి తనం భయం నిద్రలో కూడా వేటాడాలిగా కాని మనం మర్చి పోతాం దేవుని ప్రణాళికలో ఉన్న వారిని ఆయన విడిచి పెట్టడని .నువ్వు నేను ఏ ప్రణాళికతో ఏ ఉద్దేశంతో సృష్టించబడ్డామో అవి నేరవేరే వరకు లోకం విడిచినా ,స్నేహితులు బంధువులు నాఅన్న వారు వదిలేసినా నిన్ను చేసిన నీ సృష్టికర్త వదలడని .
అదే జరిగింది.
ఒక కలకన్నాడు అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండింది ; దాని కొన ఆకాశమునంటి ; దానిమీద నుంచి దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ ఉన్నారు . దేవుడు దాని పైగా నిలిచి నీకు నీ సంతానానికి ఈ స్థలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు .ఆదరణ పొందుకుని వాగ్దానాన్ని తీసుకుని బయలు దేరాడు .తండ్రి దగ్గర మోసం చేసి పొందిన దీవెనల కన్నా దేవుని దీవెనలు ఎంత బలపరిచాయో యాకోబుని క్షేమంగా తిరిగొస్తే మళ్ళీ ఆ స్థలంలో బలిపీఠాన్నికట్టి స్తుతి చెల్లిస్తానన్నాడు.
ఇహలోక తండ్రి దీవెన కుటుంబానికి దూరం చేసింది . పరమతండ్రి దీవెన తిరిగి ఉత్సాహాన్ని నింపింది .
ఈ రోజు నువ్వు అదే పరిస్తితుల్లో ఉంటే దేవుణ్ణి మాట్లాడమని నీ జీవితపు ఉద్దేశం తెలుపమని అడుగుతావా ?.
వెతికి చూడు .
అక్కడికి అవలేదు ...
తల్లి చెప్పినట్టే మామ దగ్గరకి చేరాడు .ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు ,పిల్లల్ని కన్నాడు సంతానం వృద్ది చెందింది అక్కడా తగినంత సంపాదించాడు . కాని ఆ సంపాదన జీతంగా తీసుకుని మామ ప్రేమ తగ్గిపోయిందని (ఆదికాండము 31:5) ఆస్తి విషయంలో జీతం విషయంలో మనస్పర్ధలు (ఆదికాండము 31:1) తిరిగి దేవుడు తనతో మాట్లాడిన విషయం (ఆదికాండము 31:11) లేయా ,రాహేలను తన భార్యలకి చెప్పి అంతకాలం ఆశ్రయం ఇచ్చిన మామకే చెప్పకుండా బయల్దేరి మోసం చేసిన వాడు అయ్యాడు (ఆదికాండము 31:20). ఇప్పుడు యాకోబు మామ దృష్టిలో కూడా మోసగాడే అయ్యాడు. మళ్ళీ ఆ నిందనుంచి విడిపింపబడేలోపే మళ్ళీ అన్న చంపెస్తాడనే భయం .తన ఆస్తినంతా భాగాలుగా చేసి అన్నకి బహుమతి పంపాడు , ఒక గుంపుపై దాడి చేసిన ఇంకో గుంపు ఇచ్చే సమాచారం బట్టి తప్పించుకోవచ్చు అనుకున్నాడు . అందరిని పంపి మళ్ళీ ఒంటరిగా మిగిలాడు . అదే స్థలం ముందు కలగని దేవుని ఆశీర్వాదం పొండుకున్న స్థలం .
ఈ సారి ఒక నరుడితో ఉదయము వరకు పెనుగులాడుతూనే ఉన్నాడు . మొదటి అక్కడ అదే ప్రదేశం లో దేవదూతలు ఎక్కి దిగడం చూసాడు . ఈ రెండవ సారి అతనిని దేవదూతల సైన్యం ఎదురుకుంటే చూసాడు .ఎవరు లేని ఆ ప్రాంతంలో ఏ మానవుడు ఉండడని యాకోబుకి తెలుసు మరి ఆ నరుడు దేవునికి సంబందించిన వాడని తెలుసుకుని ఉంటాడు (ఆదికాండము 32:24). నన్ను ఆశీర్వదించితేనే గాని వదలనని తనతో పెనుగులాడుతూనే ఉన్నాడు. అతని ప్రస్తుత స్థితి తెలుసు కున్నాడు . మోసగాడి జీవితం అని ఎదుటి వాళ్ళు తీర్మనించినా ఒంటరి చేయబడ్డ క్షణాల్లో దేవునితో ఇలా పెనుగులాడుతున్నాడు .
ఎంతగా పెనుగులాడాడో తెలుసా ? తన పట్టుకు ఆ నరుడే గెలవలేక పోయేలా చివరికి ఆ నరుడి చేతిలో తన తొడగూడు విరిగే వరకు పెనుగులాడాడు .అయినా విడవలేదు .తన జీవితంలో ఒక మార్పు రావాలి అందుకే ఆ మార్పు ఇవ్వగల వ్యక్తి దొరికినప్పడు తన జీవితాన్నే మార్చేయగల వాణ్ని కనుగొన్నప్పుడు తన ఆశీర్వాదం దొరికే వరకు విడువనే విడువననే పట్టుదల ఒంటరి తనంలో క్రుగిపోయిన వారికి ఒక సవాలే కదా..
ఏం జరుగుతుంది ? ఇద్దరి మధ్య ఆ పెనుగులాటలో జరుగుతున్న సంబాషణ ..
ఆ నరుడు :తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్ము
యాకోబు :నీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యను
ఆ నరుడు :నీ పేరేంటి ??
యాకోబు :యాకోబు (పేరునకు అర్ధము మోసగాడు)
ఆ నరుడు :నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని
యాకోబు అనబడదు
యాకోబు :నీ పేరు దయచేసి తెలుపుమనెను
అ నరుడు :నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.
యాకోబు :నేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు
పెనూయేలు అను పేరు పెట్టెను
ఇక ఉదయం యాకోబు ఎలా నడుస్తున్నాడు ..తొడగూడు విరిగింది కదా ... కుంటుతూ నడుస్తున్నాడు ..
ఆశీర్వాదం పొందుకున్నాడు , కుంటితేనేమి ? మోసగాడి పేరు విడిపించుకున్నాడు కుంటితేనేమి ? తన తరాలకి సరి పడ ఆశీర్వాదం పొందాడు కుంటితేనేమి ? యాకోబు అనుకుంటూ ఉండొచ్చు కుంటితే కుంటాను జీవితాంతం ఈ ఆశీర్వాదం పోగొట్టుకోకుండా , మోసగాడి బ్రతుకునుండి విడిపించబడి మరీ..
ఈ రోజు ఇలాంటి మౌనపు స్థితిలో మోసగాడని పేరు తగిలించిన లోకాన్ని పక్కకు పెట్టి ..హృదయ లోతుల్ని పరిశీలించు కుంటూ ఒక్క సారి ఆలోచిద్దామా ? ఒకప్పుడు మోసపుస్థితి , లోకం ప్రక్కకు పడేసిన స్థితి ,ఒంటరిని చేసి గొంతుని మూగాబోయేలా చేసిన స్థితి మౌనంగా రోదించేలా చేసిన పరిస్థితి , కాని ఈ రోజు యాకోబు లా నాకు ఆశీర్వాదం దొరికితేనే గాని నేను నిన్ను వదలను పర్వాలేదు యాకోబు కుంటుతూ ఆశీర్వాదం మోసుకేల్లాడు నేను నష్ట పోయిన జీవితం ఇక్కడే వదిలి ఆత్మీయంగా ఆశీర్వాదం పొంది మాత్రమే , మార్పు పొంది మాత్రమే నిన్ను వదులుతాననే పెనుగులాడే క్షణం నీ ముందుంది .. ఆ దైవ నరుని , ఆ దైవాన్ని బ్రతిమాలి తిరిగి నీ ఆత్మ విశ్వాసం నువ్వు పొంది , ఒంటరితనం నుంచి విడిపింపబడి తిరిగి లోకంలో బలం పొంది నిలబడే సమయం ఇదే .. మౌనాన్ని వీడు
ఆశీర్వదిస్తేనే గాని నిన్ను వదిలేది లేదు అని పెనుగులాడు .
(రోజు ఉదయం 6'గంటలకి సరిగ్గా మా దగ్గర కరెంటు పోతుంది కాని దేవుడిచ్చిన తలంపులను రాయడం మొదలు పెట్టి టైం చూస్తున్నా అదేంటో టైం 7:30 అవుతున్నా నేను రాయడం ముగించే వరకు కరెంటు పోలేదు .ఎందుకంటావ్ ??? . ఆయన చెదరిన నీతో మాట్లాడాలని అనుకోడానికి ఇదే సాక్ష్యం ... మళ్లో సారి గుర్తు చేస్తున్నా నేస్తమా .. లోకం నిన్ను మోసగాడివన్నా దేవుని ప్రణాళికలో నువ్వేంటో తెలుసుకున్న రోజున దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్ధం అవ్తుంది...)
by- Mercy Margaret .. (31 /10/2012)
------------------------------------------------------------------------------
No comments:
Post a Comment