Wednesday, April 17, 2013

యెషయా 60:22- " వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. " 
------------------------------------------------------------------------------------------
ఆపద యుద్ధ బేరి మ్రోగిస్తూ వచ్చింది . ఆ ఆపద నాకోసం సిద్ధం చేసుకొని వచ్చిన ఆయుధాలు , శరాలు నన్ను తగులుతూ ఉంటె , మనుషుల వైపు చూసా , మేమున్నాం .. మేమున్నాం ( అన్నా , అక్కా , వదినా , తమ్ముడు , చెల్లి , అత్త , మామ , ఆత్మా బంధు , ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళు / అంటూ పిలిచే వాళ్ళు ) అని చుట్టూ రక్షణ నిస్తామని తోడుంటామని నిలకడ లేని ప్రమాణాలతో పిట్టగోడల్లా నిల్చున్నారు .

అయ్యో .. ఆ ఆపద నేస్తమైన తుఫాను దుమ్ము దూళిని వెంటేసుకుని సుడిగాలిని ముందు పంపితే ఆ సుడిగాలులకి భయపడి పిట్టగోడలు పారిపోయాయి . అయినా కళ్ళెందుకో అప్పటివరకు ఆ వంకర రాళ్ళ ప్రమాణాల వైపుకు , సత్యాన్ని అంగీకరించని పిట్టగోడల వైపే చూసాయి గాని ఇక దాడి తట్టుకోలేని సమయంలో కొండల వైపుగా ఆకాశం వైపు కనులేత్తాయి .

సహాయం ఆ కొండల వైపునుంచే రావాలని వడపోసిన కన్నీళ్ళని మూటకట్టి హృదయాన్ని ఆకాశం లోని తీర్పరి వైపు విసిరింది . అంతే ఆకాశాన్నంటే కొండలు నడుస్తూ వచ్చి నా చుట్టూ నిల్చున్నాయి కోటగా మారాయి ,నాకు ఆశ్రయ దుర్గం అయ్యాయి .
అప్పుడు కళ్ళు సాక్షపు సంతకాన్ని కన్నీళ్ళతో చేస్తూ - " కీర్తనలు 118:8 మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.-" అని మళ్లోసారి వాక్యాన్ని నెమ్మదిగా నెమరెస్తూ జీర్నిన్చుకున్నాయి . ఇప్పుడు ఆ పిట్ట గోడలను చూసి ధైర్యంగా -
-"కీర్తనలు 62:2 ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింప బడను. ఎన్నాళ్లు మీరు ఒకనిపైబడుదురు? "

-"" కీర్తనలు 31:3 నా కొండ నాకోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే."- అని గాన మాలపిస్తూ ..

-"కీర్తనలు 27:1 యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?
మీకా 7:8 నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగి లేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును. " అని విశ్వాసంతో వాగ్దానాలను స్వతంత్రించు కున్నా .
-------------------- (17/4/2013) by Mercy Margaret -------------------

Saturday, April 13, 2013

||నా హృదయంలో ఏం చూసారు ? || by mercy margaret
--------------------------------------------------
-" రేపు నీ గుండెకి ఆపరేషన్ " 8 సంవత్సరాల అబ్బాయితో డాక్టర్ .
- "అవునా అయితే అక్కడ యేసు ప్రభు ఉంటాడు " 
-"నేను నీ గుండెను కోస్తాను "
-" అలాగా అయితే దాని లోపల మీకు యేసయ్య కనిపిస్తాడు "
" నీ గుండెను తెరిచి ఎక్కడ చెడిపోయిందో చూస్తాను "
-"అయితే ఆయనే కదా మీకు చూపించేది "
-"నేను నీ గుండెను కోస్తాను , బాగులేని ప్రదేశాన్ని బాగు చేయాలని ప్రయత్నిస్తాను
కానీ నువ్వు చూడలేవు "
-" చూడాల్సిన అవసరం లేదు నాకు తెల్సు డాక్టర్ . మా సండే స్కూల్ టీచర్ చెప్పింది ,నా హృదయంలో
యేసయ్య ఉంటాడని ,నేను పాడే సండే స్కూల్ పాటల్లో ,నేను నేర్చుకున్న
బైబిల్ వచనాలలో ,బైబిలో కూడా . నాకు తెల్సు ."

ఆ తరువాత రోజు ఆ డాక్టర్ ఆ అబ్బాయికి ఆపరేషన్ చేస్తూ ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకున్నాడు .
ఆపరేషన్ చేసినా బ్రతికిన్చలేనని తెలిసి కూడా .వణుకుతున్న చేతులతో , ఆ అబ్బాయి మాటలు గుర్తు తెచ్చుకుని మెలిపెడుతున్న తన గుండె కార్చిన కన్నీటి సాక్షిగా తన మనసులోనే దేవుణ్ణి ప్రశ్నిచడం మొదలు పెట్టాడు -" ఎందుకు దేవా ? ఇంతగా నిన్ను ప్రేమించే ఈ చిన్నోన్ని తీసుకెళ్ళి పోతున్నవ్ ?చనిపోబోతున్నాడని చెప్పినా నవ్వుతు ఉండే ఈ ధైర్యం ఆ అబ్బాయికి ఎక్కడిది ? "
దేవుడు ఆ డాక్టర్ తో ఇలా మాట్లాడ్డం మొదలు పెట్టాడు " ఆ చిన్నోడు నాకు సంభందించిన జనంలో ఒకడు , తను చనిపోయినా కూడా నాతొ పాటు నేను ఉండాల్సిన స్థలంలో ఉంటాడు ,అక్కడ ఈ బాధ నొప్పి ఉండదు , ఎప్పుడు శాంతి సమాధానం , ఆత్మలో ఆనందం , నాపై కూర్చుంటాడు .అయితే ఒక రోజు
తన తల్లి దండ్రులతో పాటు నువ్వు కూడా తనను కలుస్తావు . నా జనాంగం నాతొ పాటు ఎప్పుడు నూతన యెరుషలెములొ ఉంటుంది .అర్ధమయిందా ?"

ఆపరేషన్ అయిన తరువాత రోజు ఆ డాక్టర్ అబ్బాయినుంచిన రూం కి వెళ్ళాడు . మెల్లిగా కళ్ళు తెరుస్తూ
-"నా హృదయంలో ఏం చూసారు డాక్టర్ ?"- అన్నాడు చిన్న చిరునవ్వుతో ఆ పడక మీదనుంచే .
-"నేను ఎసయ్యను చూసాను ....... !! "కళ్ళు నిండిన నీటిని కనిపించనివ్వక చిన్న చిరునవ్వుతో ఆ వైద్యుడు సామాధానం ఇచ్చాడు .
---------- written by Mercy Margaret (12/4/2013)----------

Friday, March 15, 2013

 పుట్ పాత్ పై కుర్రాడు 
---------------------------------
ఓ కుర్రాడు స్కూల్ బాగ్ వేసుకుని , ఫుట్ పాత్ పైన పైకి కిందకి దూకుతూ ఆడుకుంటూ మాటికి తొంగి , ఆ రోడ్డు మలుపు వైపు చూస్తూన్నాడు . సాయంత్రం నడకకై బీచ్ కొచ్చిన పెద్దయనొకరు రెండు సార్లు అటు ఇటు తిరిగి , మూడవ సారి తిరిగి నడవబోతు   ఆ అబ్బాయిని చూసి ఆగి దగ్గరికెళ్ళాడు . 

బాబు అప్పట్నించి అటు వైపు చూస్తున్నావ్ , ఎవరైనా నీ కోసం వస్తారా ?? ఇంటికి తీసుకెళ్ళ డానికి  అని అడిగాడు . -"కాదు బస్ కోసం ఎదురు చూస్తున్నాను "అని ఆ కుర్రవాడు సమాధానం ఇచ్చాడు . 
-" బస్  కోసం అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి ఓ వంద అడుగుల దూరమంతే  చూడు అక్కడ  బస్టాప్లో ఉంటే  బస్  ఎక్కొచ్చు.  ఇక్కడ బస్సు ఆపరుగా" అని చెప్పి నా , ఆ కుర్రాడు వినకుండా అక్కడే నిల్చున్నాడు .
 ఆ పెద్దాయన మళ్ళీ చెప్పాడు బస్టాప్ అదో కనిపిస్తుందే అక్కడా , ఇక్కడ కాదు అని అయినా ఆ కుర్రాడు అక్కడే నిల్చుని , కాదు బస్సు ఇక్కడే ఆగుతుంది నాకు తెలుసు అని సమాధానం ఇస్తునాడు .

 అలా ఓ నాలుగు సార్లు చెప్పి ఐదో సారి చెప్పబోతున్నంతలో బస్సు ఆ మలుపు తిరిగి వస్తూనే ఉంది . బాబు ఎందుకు లేట్ అవ్వడం చీకటి పడబోతుంది బస్టాప్లో నిల్చో ఇక్కడ బస్సు ఆపరు అని ఆ పెద్దాయన మళ్ళీ చెప్పాడు .కాని ఆ కుర్రాడు కాదు బస్సు ఇక్కడే ఆగుతుంది అని అదే సమాధానం ఇచ్చాడు . 

బస్సు అలా వచ్చి ఆ బాలుడు నిల్చున్న చోటే ఆగింది . ఆ పిల్లాడు బస్సు ఎక్కి వెనక్కి మళ్ళీ , చెప్పానుగా బస్సు ఇక్కడే ఆగుతుందని , ఎందుకంటే బస్సు డ్రైవరు మా నాన్న అంటూ గబ గబా లోపలి పరుగెట్టాడు . 

నిజమే బస్సు డ్రైవరు మన పరలోక తండ్రి అయితే బస్సు స్టాప్ తో మనకేం పని .  ఒక వేళ మన అమ్మ గవర్నరు అయ్యుంటే రాజభవన్లోకి వెళ్లేందుకు మనకెందుకు అనుమతి ? అలాగే ఎప్పుడైతే మన హృదయాన్ని , రాజుల రాజు , ప్రభువుల ప్రభువైన ఏసయ్యకు ఇస్తామో ఇంక ఏలాంటి పెర్మిషన్ అవసరం లేదు మనకి . ఎప్పుడంటే అప్పుడు ఆయనని హత్తుకుని సావాసం చెయ్యొచ్చు 

Saturday, February 2, 2013

It is not just a "Name"
-----------------------

తు థు...  వాడి పేరు నా ముందు ఎత్తకు అన్న మాట చాలా  సార్లే విని ఉంటాం .
పేరు అనగానే ఆలోచిస్తున్నా ..
లోకంలో మనుషులకు ,  ప్రాణులకు పేర్లు లేకుండా ఉంటే లోకం ఎలా ఉండేదా  అని ?
ఒకరినొకరు ఎలా పిలుచుకునే వాళ్ళు ?
జంతువులను పక్షులను ఇవి-అవీ  అని ఎలా చెప్పేవాళ్ళు ?
అంతే కాదు 
ఒక వేళ  మనుషులు పెరుగుతున్న క్రమంలో వాళ్ళ ప్రవర్తనని బట్టి పేరు పెట్టే పద్ధతి  ఉంటే అప్పుడు మనుషులకు 
ఎలాంటి పేర్లు ఉండేవా అని ?? 

అస్సలు పేర్లు పెట్టడం ఎక్కడ మొదలై ఉంటుందని ?
ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని లేఖనానుసారమైన మాటలు గుర్తొచ్చి 
ఆశ్చర్యం వేసింది .

ఆది కాండము 2 వ అధ్యాయం 2 వ వచ్చనంలో -" దేవుడు తాను చేసిన పని యేడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని యంతటి నుండి ఏడవ  దినమున విశ్రమించెను " అని  ఆయన సృష్టి నంతటిని చేసాడు , ఆ మొదట చేయ బడ్డ వారికి కూడా పేర్లు లేవు ఆదాము అనగా మట్టి నుండి చేయబడిన , లేదా మొదటి మనుష్యుడనే తప్పా ఆయనకూ  పేరు లేదు .మరి ఎక్కడ పేర్లు పెట్టడం మొదలయ్యింది  ??

ఆది కాండం 2 వ అధ్యాయం 19 వ వచ్చనంలో " దేవుడైన  యెహోవా ప్రతి భూజంతువును ,ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ,ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవము గలిగిన ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు  దానికి కలిగెను " అని ఉన్నట్టు చూస్తాం . అంటే సృష్టి చేసిన తరువాత దేవుడు పేర్లు పెట్టే అవకాశం మనిషికే యిచ్చాడు కదూ .

తరువాత " అబ్రామును " అబ్రహాముగా .సారాను శారా గా పేర్లు మార్చడం , యాకోబును ఇశ్రాయేలుగా పేరు మార్చి  పేరులో ఉన్న కళంకాన్ని , అపజయాన్ని తీసివేసి  కొత్త పేరును ఇవ్వడం , గర్భంతో పారిపోతున్న హాగారును ఆ ఎడారిలో పలకరించి పుట్టకముందే శిశువు పేరు ఇస్మాయేలు  అని పేరు కూడా పెట్టమని   చెప్పిన దేవుడుగా కూడా చూస్తాం .

అలాగే కీర్తనలు 147 : 4 లో "- నక్షత్రముల సంఖ్య ను ఆయనే నియమింఛి యున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు " అని చూస్తాం అన్ని నక్షత్రాలకు పేర్లు పెట్టాడంటే ఆయన సృష్టించిన  ప్రతియొక్క  సృష్టము మీద ఎంత శ్రద్దో కదా ..!! 

ఆకశామండలములోని నక్షత్రాలకే కాదు ఆయన మనకి కూడా పేర్లు పెట్టేశాడు తల్లి గర్భంలో ఉండగానే .ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు . మన గల్లీకో ఇంటికో లేక ఏ పెద్ద సమావేశంలోనో ఏ ప్రధాన మంత్రో , రాష్ట్రపతో వచ్చి పేరు పెట్టి నిన్ను పిలిస్తే ఎలా ఉంటుంది ?? 
జక్కయ అని ఒక పొట్టి మనిషి యేసుప్రభువును  చూడాలని ఎవరికీ తెలియకుండా మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు .ఆ చెట్టును దాటివెళ్ళకుండా యెసయ్య చెట్టు పైకి చూసి జక్కయ కిందికి దిగిరా మీ ఇంటికి వెళ్దాం అని పిలిచినప్పుడు ఎంత సంతోషం వేసి ఉంటుందో ? నా పేరు ఈయనకెలా తెలుసనీ ఆశ్చర్యం . ఈయనకు నేను తెలుసు అన్న ఆనందం .
ఎప్పటి నుంచో నీపేరు , నా పేరు దేవునికి తెలుసా అన్న సందేహం ఉండి ఉంటే  ఇక ఆ సందేహం అవసరం లేదు .ఆయనకీ మన ప్రతి ఒక్కరి పేర్లు తెలుసు .. నువ్వు ఆయన వైపు చూడు ఆయన పిలుస్తూనే ఉంటాడు కాని నువ్వు పలుకుతున్నావో లేదో ? 
సరే కాని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నీ పేరు నీకు మంచి తెస్తుందో చెడు తెస్తుందో ? లేక  నీపేరు పిలవగానే జనాలకు ఎంత మంచి గుర్తోస్తుందో  అని ;