Thursday, April 10, 2014

శ్రమలు- ఆశీర్వాదాలు
-----------------

ఈ లోకంలో జీవిచడం చాలా కష్టమైన పనే. అందుకే అంటుంటారు కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటడం కష్టమని. ఒక భక్తుడైతే నడిపించు నా నావ అని పాట కూడా రాసాడు దాన్ని మనం కూడా అంతే ధ్యానపూర్వకంగా పాడుతూ ఉంటాం.

చాలా సార్లు మనకు కష్టాలు, బాధలు , నష్టాలు సంభవించినప్పుడు అనుకుంటూ ఉంటాం ఈ నా కష్ట సమయంలో అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. అన్యాయం , మోసం మనపై విజయం సాధిస్తుంటే అస్సలు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని. అయితే మనం దాటొచ్చిన సంఘటనలపై ఎలా ప్రతిస్పందించాలో ఎలా స్పందించలేమో అనే  నిర్ణయం, ఎంపిక కూడా మనపైనే ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంధంలో "హబక్కుకు " అనే ప్రవక్తకి  కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడినప్పుడు ఆయన సంతోషించడానికే  మ్రొగ్గు చూపాడు.

యూదులలో ప్రభలంగా పెరిగిన ఆత్మీయలేమి, అవినీతి విషయమై హబక్కుకు చాల కలత చెందాడు. దేవుని యొక్క ప్రతిస్పందన కూడా హబక్కుకుకు  బాధ కలిగించింది. యెహోవా తలుచుకుంటే ప్రక్కనే ఉన్న పాపాత్ములైన బబులోను సామ్రాజ్యాన్ని దండెత్తింప చేసి యూదా దేశ ప్రజలకు బుద్ది తెప్పించగలడు కాని ఆయన అలా చేయలేదు. ఈ విషయం హబక్కుకును ఇంకా ఆలోచింప చేసింది . అయినా హబక్కుకు పరిశుద్ధుడైన యెహోవా యొక్క నీతి , న్యాయ యదార్దతలను , ఆయన జ్ఞానం మరియు సార్వభౌమత్వాన్ని బట్టి ఆనందిస్తూ అందును బట్టి ఆయన్ని కీర్తిస్తున్నాడు.

హబక్కుకు 3:17-18-" అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను| నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను." అంటున్నాడు. 


యూదులు యెహోవాను  నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగిన ఫలితాలేంటో  పక్కకి పెడితే హబక్కుకు మాత్రం యెహోవా యొక్క నీతిన్యాయ యదార్ధతలను కీర్తిస్తూ ఆయనపైనే విశ్వాసంతో ఆనుకున్నాడు. హబక్కుకు కేవలం యెహోవా యందలి విశ్వాసంతో జీవించడానికి  ఇష్టపడ్డాడు. ఆ విశ్వాసమే ప్రతికూల సమయాలలో కూడా ఆనందం పొంది రక్షణకర్తయైన దేవునిలో సంతోషించేలా చేసింది. 

యెహోవా యందు విశ్వాసంతో మనం కూడా మన శ్రమలలో హబక్కుకులా ఆనందించొచ్చు. ఆయన కృపాతిశయములో ఆనందిస్తూ ఆయన  సార్వభౌమత్వాన్ని దగ్గరగా చూడగలము.

"మన శ్రమలలో దేవుణ్ణి స్తుతించడం వల్ల  శ్రమలు ఆశీర్వాదాలుగా మారుతాయి " 


Be this the purpose of my soul My solemn, my determined choice: To yield to God’s supreme control, And in my every trial rejoice. —Anon.