Tuesday, March 25, 2014

అసూయతో పోరాటం
________________
ఒకర్నొకరు భయంకరమైన శత్రువులుగా భావించుకునే ఇద్దరు దుకాణం యజమానుల గురించి చెప్పబడ్డ ఒక  కథ ఉంది.  ఆ ఇద్దరు ఓనర్ లు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ దుకాణంలో ఏం  జరుగుతుంది ?? వాళ్ళ వ్యాపారం ఎంత జరిగింది ?? ఎంత మంది కస్టమర్లొ చ్చారు ?? లాంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించే వారు. వారి దుకాణానికి ఎవరైనా ఒక కస్టమర్ వస్తే , ఎదుటి వాడి వైపు చూసి గట్టిగా గర్వంగా   నవ్వేవారు .

ఇలా ఉండగా ఒక రోజు రాత్రి దుకాణం యజమానుల్లో ఒక యజమాని దగ్గరకు ఒక దూత వచ్చి, ఏం  వరం కావాలో కోరుకో కాని ఒకటి గుర్తుంచుకో, నువ్వు కోరుకునే కోరికకు రెండంతలు నీకు  పోటీఅయిన వాడికి అంటే నీ పొరుగు దుకాణం ఓనర్ కి  జరుగుతుంది అని, తను వచ్చిన ఉద్దేశ్యం చెప్పింది . 


వెంటనే ఆ యజమాని దూత కాళ్ళ మీద పడి తన కళ్ళలో ఒక కన్ను తీసేయమని వరమడిగాడు .

అసూయ, ద్వేషం ఎలాంటివంటే స్వనాశనాన్ని కాంక్షించి స్వపతనం వైపు నదిపేవి.

ఈ అసూయనే కోరింథి సంఘాన్ని చీల్చింది. కోరింథి  సంఘంలోని విశ్వాసులు వాక్యాన్ని అంగీకరించినా వారి హృదయాలను పరిశుద్ధాత్మకు , పరిశుద్ధాత్మ కార్యానికి  అనువుగా మార్చుకోలేదు. దాని పర్యవసానంగా అసూయ తమ హృదయాల్లో చేరి కోరింధి  సఘాన్ని చీల్చింది. అదే విషయాన్ని I కోరింధి 3:3 లో పౌలు మాట్లాడుతూ -

"మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా? " అని అంటాడు . అయితే ఆ విశ్వాసులు నిజంగా సువార్త విని వాక్యపు జీవంతో పరిశుద్ధాత్మ ఒప్పుకోలుతో నడిచిన వారిలా  ఉండరు. 
ఈ మధ్య కాలంలో మన సంఘాల్లో కూడా ఇది చూస్తున్నాం. ఒక వర్గం వారు నాయకులైతే మరో వర్గం వారు సంఘానికి వాళ్ళ నియమకాలం అయ్యే వరకు రారు. ఒక వర్గం ఒకటి ప్రతిపాదిస్తే ఇంకో వర్గం వినదు. అసలు సంఘానికి ఆరాధన కోసం కాక  తమ ఉనికి చాటుకోవడానికి మాత్రమే  వస్తున్న వారు లేరా ? ఇలాంటివి సంఘాల్లో జరగడం వల్లనే కొత్త కొత్త స్వతంత్ర సంఘాలు పుట్టుకొచ్చి కొత్త ఆరాధనా క్రమాలు , తప్పుడు బోధలు జరగడానికి పీఠలు వేయడం లేదా ? సంఘం క్రీస్తు శరీరం క్రీస్తు సంఘానికి అధిపతి అనే విషయం మనం మర్చే పోతున్నాం . కాదంటారా ?ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు  తమ హృదయాల శుద్ధీకరణ చేస్తూ తమతో వాసమై ఉంటాడో అక్కడ ఇలాంటి అసూయకు తావే ఉండదు . 


పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తున్నాడు అన్న దానికి సూటి అయిన నిదర్శనం మనకు కలిగిన ప్రతిదానికి మనం ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాం. ఒకరి మీద ఒకరికి అసూయ లేకుండా అందరికీ కలిగే ఆశీర్వాదాలను బట్టి సంతోషిస్తాం. 


ఈ రోజు దేవునికి కృతఙ్ఞతలు చెబుదాం. -"దేవా నువ్వు మాకిచ్చిన ప్రతి శ్రేష్టమైన ఈవులను బట్టి నీకు కృతజ్ఞతలు. మాకేది అవసరమో అది నువ్వు మాకిచ్చావ్. మాకన్నా ముందే మా అవసరతలు నీకు తెలుసు. నువ్వు మాకున్న గొప్ప గనివి, మా సంపదల నిదివి ,జీవపు ఊటవి . ఒకవేళ నువ్వే లేకపోతే  మాకు ఈ బ్రతుకే ఉండేది కాదు "అని . 


No comments:

Post a Comment