Friday, October 3, 2014

మన శక్తికున్న పరిమితులు
---------------------------------

దేవుడు మోషే ని తన పనికై పిలిచాడు. అవును 420 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను ఐగుప్తునుంచి బయటికి తీసుకుని రావడానికి. అప్పుడు మోషే ఏమన్నాడో తెలుసుగా " అప్పుడు మోషే - ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడను "   అని అనడం నిర్గామకాండం4:10 లో చూస్తాం. 

మోషే మాటలను బట్టి చూస్తే ఆయనకు మాట్లాడేప్పుడు కలిగే ఇబ్బంది ఉన్నట్టు బాగా నత్తి ఉన్నట్టు అర్ధం చేసుకోవచ్చు. నేను నత్తి వాణ్ని అని మోషే దేవునితో సమాధానం చెబుతుంటే దేవుడేమన్నాడో చూడండి. నిర్గమ 4:11  "యెహోవా - మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా."  అని. నోరుగల వాళ్ళని , మాట్లాడలేని వాళ్ళని , వినలేని వాళ్ళని , చూడలేని వాళ్ళని కూడా పుట్టించింది దేవుడే అని మనం చూస్తాం.  

మన బలహీనత, అశక్తత, వైకల్యాన్ని దేవుడు తన మహిమ గురించి వాడుకుంటాడు. ఆ బలహీనతల్ని కలగించడం ద్వారా దేవుడు మనల్ని  తక్కువగా చేసాడని కాదు కాని ఆయన ఆ బలహీనతల్ని తన మహిమ గురించి వాడుకోడానికి ఆ బలహీనతలో మనం  దేవునికి మరి దగ్గరగా చేరడానికే కలిగిస్తాడు. 
మన వైకల్యం ఆయన మీద ఆధారపడడానికే గాని ఆయనకు ఆటంకం కాదు. ఆయన మీద ఆధారపడుతూ ఆయనతో సంబంధాన్ని బలపరుచుకుంటూ , మన బలహీనతలో ఆయన శక్తిని రుచి చూస్తూ ఆయనలో ఆనందాన్ని పొందేందుకు మన వైకల్యం కారణమైతే ఎందుకు చిన్న తనంగా భావించాలి. 

అపోస్తులుడైన పౌలు నా బలహీనతను చూసి దాన్ని తొలగించు అని మూడు సార్లు దేవుని దగ్గర ప్రాధేయపడ్డట్టు చూస్తాం. అలా ప్రాధేయపడేప్పుడు వేడుకునేప్పుడు ఈ మాటలు కూడా ఆయన హృదయపూర్తిగా అన్నాడు - 2 కోరింథి 12:10 లో  "నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.  అప్పుడు ప్రభువు తనతో అన్న మాటలు తనకెంత ఆదరణ ఇచ్చి యుంటే అలా అనగలడు మన ప్రభువును రక్షకుడునైన యేసు ఏమన్నాడు  ఎందుకంత ఆదరణ పౌలు పొందగలిగాడు 2 కోరింథి 12:9 - "అందుకు - నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహుసంతోషముగా అతిశయ పడుదును."    

పౌలులా మనం ఎందుకు ఆలోచించ కూడదు?? మన బలహీనతలో , మన వైకల్యంలో ఆయనపై ఆధారపడుతూ ఆయనని దగ్గరగా చూస్తూ , ఆయన మహిమ కోసం ఆయన మనల్ని వాడుకునేప్పుడు ఎందుకు ఆయనకి మన జీవితాల్లో ప్రధమ స్థానం ఇచ్చి మన అశక్తతలో , మన బలహీనతలో , వైకల్యంలో ఆయన మహిమకోసం మనల్ని మనం సమర్పించుకోకూడదు. 

God uses weakness to reveal
His great sufficiency;
So if we let Him work through us,
His power we will see. —Sper
God's strength is best seen in our weakness.

No comments:

Post a Comment