Tuesday, October 9, 2012

దైవీకమైన ప్రేమ :
--------------------
                         ప్రేమలో దైవత్వమున్నప్పుడు ,ప్రేమ దైవ చిత్తనుసారముగా పుట్టినప్పుడు, ప్రేమ దైవ మూలాలనుండి నిన్ను తాకి నీ లోకి వచ్చినప్పుడు ఆ ప్రేమ ఒక ప్రవాహంలా సాగిపొతూనే ఉంటుంది .
ఆ ప్రేమ కొత్త చిగురులు తొడుగుతూ క్రొత్త క్రొత్తగా  రూపు దాల్చుతూ ఉంటుంది .ప్రతి రోజు క్రొత్తదనంతో నిండుకొని నిన్ను నీకు పరిచయం చేస్తుంది.రోజూ ఒక క్రొత్తద్రాక్షారసమై నిన్ను తన మత్తులో ముంచుతూనే ఉంటుంది .

                   దానికెప్పుడు నీ ప్రస్తుతంతోనే సంబంధం నీ వర్తమానంతో అంటుకట్టబడి నీ భవిష్యత్తు కాంక్షిస్తూ ఇవ్వాల్టి తప్పిదాలను కప్పి ఎరువుగా రేపటి ప్రేమకు బలంగానే మారుతుంది .తన భవిష్యత్తును  బలంగా చేయడానికి ప్రేమ పాదులను తన తడితో నింపుతుంది .ప్రతి  బలహీనమైన క్షణాన్ని ఆహ్వానిస్తుంది కౌగలించుకుంటుంది .తన శక్తివంతమైన బాహుబంధాల్లో మార్పును  చూపి ఆ మార్పులో ఆనందం కళ్ళలో కనిపించేంత వరకు వెంట నడుస్తూనే ఉంటుంది .జీవితపు  కూడికలు  తీసివేతలో శేషాన్ని చూడదు , మిలుగు ,మొత్తాన్ని చూడదు గాని సమాన మైన  అవగాహన సంతృప్తి కాంక్షిస్తుంది .ఎప్పుడు "ఒకటి గా "ఐక్యంగా " ఉండి విడగొట్టబడకుండా ఉండాలని కోరుకుంటుంది .

                  అన్నింటిని తనలోనికి ఆకర్షించుకొని తన రూపం లోకి మార్చుతుంది మరియు  పంపుతుంది.ప్రేమ నిర్వచనాలు లేనిది కాదు గాని  -" ప్రేమ దేవుడు " అని పౌలు అన్నట్టు నిజమైన ప్రేమ మనలో ఉండే దైవత్వమే .మనుష్యులుగా మనకున్న హద్దులను దాటి ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేంతగా తన స్వభావంలోనికి , తన సమానత్వంలోనికి తనలాగే మార్చి -" జీవితం అంటే ప్రేమ " అని జీవించాల్సిన అర్ధాన్ని ,పద్దతిని ఇస్తుంది . 
   
                 తడబడ్డ అడుగులకు జోళ్లుగా ,వణుకుతునప్పుడు,  సమాధానం లేనిదేదో   చేయబోయేవేళ నీలో తన అలికిడిగా నిన్ను పాపంవైపు చూడనివ్వక వెళ్ళనివ్వక ,కృపతో కలిసి ఓటమిలో కూడా  నీకు తన రుచి చూపి విజయపు నిర్వచనం "ఇది " అని నిజాన్ని నీకు పరిచయం చేస్తుంది .   
                
                 శ్వాసలో నీకు పట్టుదలగా ఉంటుంది .నీ ఉనికిలో కర్తవ్యం నీకు వెలుగుగా ఉంటుంది .నీవు నీకు ప్రతిసారి సవాలుగా ప్రేమలోనూ అందాన్ని చూడమంటూ ఒక క్రొత్త అధ్యాయాన్ని నీతో తెరిపిస్తుంది . రోజూ  విద్యార్దినే చేస్తుంది .రోజూ  కురిసే మన్నాలా నీకు నీ అవసరతలో క్రొత్తగా నీ దగ్గరికి దిగి వస్తూ నీతో  దైవంలానే సహవాసం చేస్తుంది.

                 నిజమైన ప్రేమ ,దైవికమైన ప్రేమ నీ జీవితానికి ఉద్దేశాన్ని ,ఒక విలువను తెచ్చి నిరంతరం క్షమిస్తూ రోజూ  రోజూ    హృదయంలో క్రొత్త నీరులా ఉబుకుతూ వస్తూ నిన్నే కాదు నీ చుట్టుప్రక్కల పరిస్తితులను కూడా సమాధానంతో నింపుతుంది. శాంతి సమాధానాలతో సహవాసం చేస్తూ నీ బదులు నీకోసం నిత్యం ప్రభువుకు విజ్ఞాపన చేస్తూ నిన్ను దేవుని ముందు ఎత్తిపడుతుంది. 

               దైవీకంగా పుట్టిన ప్రేమను ఎప్పుడైనా అనుభవిస్తేనే అర్ధమవుతుంది .ప్రార్దించి అలాంటి ప్రేమని ఇమ్మని అడుగుదామా  ఇవ్వాళా ప్రభువుని ?  

(నా అనుభవంలో నేను పొందిన ప్రేమను బట్టి ప్రేరణతో రాసింది ... )

1 comment:

  1. baagundi baagaa vraasaaru...blog lokaaniki swaagatam mercy margare gaaroo!...

    ReplyDelete